ఆ సినిమా రేంజి వేరే లెవల్లో ఉంటుంది..!

ఒక తెలుగు నటుడికి దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ రావడం ఇదివరకు మనమెన్నడూ చూడలేదు. ‘బాహుబలి: ద బిగినింగ్’ వేసిన ఫౌండేషన్‌తో ‘బాహుబలి: ద కంక్లూజన్’తో మరింత రెచ్చిపోయాడు ప్రభాస్. ఇక ఆ సినిమాతో ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. ప్రభాస్ మేనియాతో ఊగిపోయారు. ఆరడుగుల విగ్రహం వుండేవాళ్లు చాలామందే ఉంటారు. దానికి గ్లామరస్ లుక్ కూడా తోడైతే, ఒక హీరో ఎలా ఉంటాడనేందుకు ట్రూ ఎగ్జాంపుల్‌గా నిలిచాడు ప్రభాస్. ‘బాహుబలి 2’ మూవీ వసూళ్ల సునామీతో అదివరకటి హిందీ సినిమాల రికార్డుల్ని కూడా తుడిచిపెట్టేసి సరికొత్త రికార్డులు సృష్టించడం నిజంగా ఒక ఫినామినా. కానీ నార్త్ బెల్ట్‌లో ‘సాహో’ చేసిన వీరవిహారం చూసి బాలీవుడ్ స్టార్లు కళ్లు తేలేశారు. తరణ్ ఆదర్శ్ లాంటి పేరుపొందిన బాలీవుడ్ విశ్లేషకుడు ‘అన్‌బేరబుల్’ అంటూ 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చి ‘సాహో’ను దారుణంగా విమర్శించాడు. అలాంటివాడు ‘సాహో’ హిందీ వెర్షన్ సూపర్ హిట్టవడం చూసి బిత్తరపోయాడు. క్రిటిక్స్ అంతా చెత్త అని తేల్చేసిన ‘సాహో’.. హిందీ వెర్షన్ కేవలం 5 రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల రూపాయల్నీ, ఓవరాల్‌గా 142 కోట్ల రూపాయల్నీ రాబట్టి ప్రభాస్ ఇమేజ్ ఏ రేంజిలో ఉందో చాటి చెప్పింది. సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్ వంటి బాలీవుడ్ స్టార్లు, సౌత్ ఇండియాలో స్టార్లు కారు. ఆ విషయం ఇటీవలి ‘వార్’ మూవీతో తేటతెల్లమైంది. బాక్సాఫీస్ దగ్గర ‘వార్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా రికార్డులు సృష్టించింది. ఇద్దరు టాప్ యాక్షన్ స్టార్లు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్.. అందులో నటించారు. కానీ ఆ మూవీ తెలుగు వెర్షన్ ఆరేడు కోట్ల రూపాయలని మించి వసూలు చేయలేకపోయింది.తాజాగా ‘వార్’ సినిమాకు సీక్వెల్‌ని ప్లాన్ చేస్తున్నారనీ, అందులో ప్రభాస్‌ను ఓ హీరోగా నటింపజేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనీ ప్రచారంలోకి వచ్చింది. కారణం హృతిక్‌తో పాటు ప్రభాస్ కూడా నటిస్తే, ఆ సినిమా రేంజి వేరే లెవల్లో ఉంటుందనేది నిర్మాతల ఆలోచన అని చెప్పుకుంటున్నారు. ప్రభాస్ ఆ సినిమా చేస్తే, తెలుగునాటే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వస్తుందనీ, అది కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందనీ నిర్మాతలు భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల మాట.

Tags:

Leave a Response