ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది?

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం పై వెలసిన ఉగ్రవాద శిబిరాలు లాంచ్ పాడ్ లను ధ్వంసం చేసిన తర్వాత పలుమార్లు దాడులకు పాల్పడింది.భారత సైన్యం రెండు రోజుల క్రితం భారీ కాల్పులతో పీవోకే లోని ఉగ్రవాద శిబిరాలను సైనిక పోస్టులను ధ్వంసం చేసినా పాకిస్థాన్ బుద్ధి మారలేదు. సరిహద్దుల గుండా ఉగ్రమూకల్ని పంపడం ద్వారా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘిస్తూనే ఉంది. జమ్ము కశ్మీర్ లో చోటు చేసుకున్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ముష్కరులు హతం కాగా ఒక సైన్యాధికారి నేలకొరిగాడు. ఎల్.వో.సీ వెంట పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు గాయపడ్డారు.దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆగస్టులో గుజర్ వర్గానికి చెందిన ఇద్దరి సోదరులను చంపడంలో వీరి ప్రమేయం ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. భారత్ లోకి చొరబడటానికి ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు, సరిహద్దు దాటేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలని గుర్తించడానికి డ్రోన్ లు వినియోగిస్తున్నారు.కేమెరాలతో కూడిన డ్రోన్ లను ఇటీవల పంజాబ్ లోని ఫిరోజ్ పూర్, హుసేన్ వాలా సెక్టార్ లలో భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో ఈ ప్రాంతంలో భారీగా భద్రతా దళాలు మోహరించారు. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాదులను భారత్ లోకి పంపేందుకు ప్రయత్నిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు, లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ కూడా వీరికి సహకారం అందిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

Tags:pakisthan

Leave a Response