కార్తికేయ తొలి సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తోనే కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ‘హిప్పీ’ సినిమాను ఎంచుకున్నారు. టైటిల్, పోస్టర్, టీజర్‌తోనే సినిమాపై అంచనాలు టాలీవుడ్ ప్రజలకు పెరిగిపోయాయి. చాలా కాలం తర్వాత జేడీ చక్రవర్తి ఒక కీలక పాత్రలో నటించారు. టీఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కార్తికేయ రెండో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారా? లేదా?చూద్దాం.
ఇక కథ విషయానికి వస్తే: హిప్పీ దేవదాస్ అలియాస్ దేవ (కార్తికేయ) సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఎప్పుడు జాలిగా స్నేహితులతో కలిసి గడుపుతుంటాడు. ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవంశీ) అనే అమ్మాయితో సహజీవనం చేస్తుంటాడు. స్నేహ (జజ్బాసింగ్) దేవాని ప్రేమిస్తున్నా, స్నేహ కాదని వెంటపడి మరీ ఆముక్త మాల్యద మనసు గెలుచుకునేందుకు పరితపిస్తాడు మన హీరో. ఆమె చుట్టూ తిరిగేంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆమె తిరిగి ప్రేమించడం మొదలు పెడుతుందో అప్పట్నుంచి తన స్వేచ్ఛని కోల్పోయినట్టుగా భావిస్తాడు దేవా అలియాస్ హిప్పీ. మరి వారి ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లిందా? లేదా? వీరి ప్రేమకథని హిప్పీ బాస్ అయిన అరవింద్ (జేడీ చక్రవర్తి) ఎలాంటి మలుపు తిప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మనం ప్రేమిస్తే ఆ అనుభూతి స్వర్గంలోకి వెళ్లినట్టుగా ఉంటుంది. తిరిగి మనల్ని ప్రేమిస్తే స్వర్గం కోల్పోయినట్టుగా ఉంటుందనే అంశం చుట్టూ అల్లిన కథ ఇది. ప్రేమలో పడ్డాక అమ్మాయి పెట్టే షరతులు, ఆమెకి నచ్చినట్టుగా బతకాల్సి రావడం, అందుకోసం పడే తాపత్రయపడటం వంటి విషయాలన్నీ కూడా కుర్రాళ్ల స్వేచ్ఛని హరించినట్టు ఉంటాయని.. ఆ దశలో ప్రేమని అర్థం చేసుకోవడమే ముఖ్యం అన్న విషయాన్ని దర్శకుడు తనదైన శైలిలో చెప్పాడు. కుర్రాళ్ల ఆలోచనలకి అద్దం పట్టే కథ ఇది. ఒక చిన్న అంశాన్ని ఎంచుకొని, దాన్ని కథగా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథ కంటే కూడా కథనమే కీలకం. అయితే ఇందులో సామాన్య ప్రేక్షకుడికి అర్థం కాని విషయాలు చాలా ఉంటాయి. ప్యారడైజ్, ఎరెక్షన్, ఇంపొటెంట్ అంటూ మల్టీప్లెక్స్ ప్రేక్షకులు మాత్రమే అర్థం చేసుకొనే విషయాలున్నాయి. ఆరంభ సన్నివేశాలు మొదలుకొని ప్రధమార్ధం సరదాగానే సాగిపోతుంది. అక్కడక్కడా సంభాషణలు ద్వంద్వార్థాలతో వినిపించినా… కామెడీ, రొమాన్స్, యాక్షన్ అంశాలతో ద్వితీయార్ధంలోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత కథ ఎంతకీ ముందుకు సాగదు. ఎక్కడైతే మొదలైందో అక్కడికే వస్తుంది. దాంతో సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లోనూ కొత్తదనం ఏమీ లేదు. కథలో మలుపు కోసమని జేడీ పెళ్లి తంతుని మొదలుపెట్టినా…ఆ తర్వాత సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగానే సాగిపోతుంటాయి. కథ పరంగా చేసిన దర్శకుడు చేసిన కసరత్తులు చాలలేదు. అక్కడక్కడా వినడానికి ఇబ్బందిగా అనిపించే సంభాషణలు చాలా వినిపిస్తాయి.