పౌరసత్వ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. నేడు చర్చించి బిల్లుకు ఆమోదం తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ లో మత పీడనకు గురై అక్కడి నుంచి భారత్ కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో 11 ఏళ్ల పాటు దేశంలో ఉంటేనే పౌరుసత్వం ఇచ్చేవారు. సవరణ చట్టంలో దానిని 5 ఏళ్లకు కుదించారు. అక్రమ వలసదారులుగా వారి పై నమోదైన కేసులను కూడా ఎత్తి వేయాలని బిల్లులో పేర్కొన్నారు. కేసులు ఉన్నాయన్న కారణంగా పౌరసత్వాన్ని నిరాకరించడానికి లేదని స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును వ్యతిరేకిస్తూ వివిధ సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. అక్రమంగా వచ్చిన శరణార్థులను శాశ్వత నివాసులుగా పరిగణిస్తే ఈ ప్రాంత జనాభా వివరాలలో మార్పులు వస్తాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యం లోనే ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనలకు భరోసా ఇచ్చేలా సవరణ చట్టంలో కేంద్రం నిబంధన విధించింది.