ఆంధ్రప్రదేశ్ లో నేడు పదో తరగతి ఫలితాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థులు 88% ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. 98.19% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన తూర్పుగోదావరి జిల్లాకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు చంద్రబాబు బాసటగా నిలిచారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఉత్తీర్ణులు కాని తమ పిల్లలను తల్లిదండ్రులు ఇతరులతో పోల్చవద్దని కోరారు. విద్యార్థులను ఉత్తేజపరచడం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు ప్రేరణగా, అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తీర్ణతలో అభిలషణీయ, ఆరోగ్యకర పోటీ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఏపీ సీఎం ట్విట్టర్ లో స్పందించారు.