‘హాలీవుడ్ సినిమాల్ని నాతో పాటు తెలుగు హీరోలంతా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మేము నటించిన సినిమాల్ని డిస్నీ వారు హాలీవుడ్లో విడుదల చేసే రోజు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు విజయ్ దేవరకొండ.ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్, లిండా హామిల్టన్ ప్రధాన పాత్రల్లో నటించిన హాలీవుడ్ చిత్రం ‘టెర్మినేటర్ డార్క్ ఫేట్’. జేమ్స్ కామెరూన్, డేవిడ్ ఎల్లిసన్ నిర్మించారు.టీమ్ మిల్లర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాను డిస్నీ సంస్థ తెలుగులో విడుదలచేస్తున్నది. నవంబర్ 1న ఈ చిత్రం విడుదలకానుంది. తెలుగు ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో హీరో విజయ్ దేవరకొండ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు.
ట్రైలర్ చూస్తుంటే నా పాఠశాల రోజులు గుర్తొచ్చాయి. స్కూల్‌డేస్‌లో జేమ్స్ కామెరూన్, ఆర్నాల్డ్ కలయికలో వచ్చిన ‘టెర్మినేటర్ జడ్జిమెంట్ డే’ సినిమా చూశాను. అందులో విలన్ అస్సలు చనిపోడు. సినిమా చూస్తూ వీడేంటి ఎంతకి చనిపోవడం లేదని భయపడిపోయాను. ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్ హంగులతో అద్భుతంగా పాత్రల్ని, సినిమాను తీర్చిదిద్దారు జేమ్స్ కామెరూన్.‘జడ్జిమెంట్ డే’ తర్వాత వచ్చిన ‘టెర్మినేటర్’ సిరీస్ సినిమాల్లో ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. హాలీవుడ్ సినిమాల్ని ఎక్కువగా ఇంగ్లీష్భాషలోనే చూస్తుంటాను.‘300’ సినిమాకు ఇంగ్లీష్ వెర్షన్ టికెట్స్ దొరక్కపోవడంతో తెలుగు అనువాదంలో చూశాను. అదే నేను డబ్బింగ్లో చూసిన తొలి హాలీవుడ్ మూవీ. ఆ రోజుల్లో డబ్బింగ్ సినిమాలు చూసి నవ్వుకునే వాళ్లం.నాణ్యత అస్సలు బాగుండేది కాదు. కానీ ఇప్పుడు డబ్బింగ్ ప్రమాణాలు మెరుగయ్యాయి. సినిమాల్ని ప్రేమిస్తారు.. తెలుగు ప్రేక్షకులు సినిమాల్ని చాలా ప్రేమిస్తారు. భాషాభేదాలతో సంబంధం లేకుండా అన్ని సినిమాల్ని చూసే సంస్కృతి ఇక్కడ కనిపిస్తుంది. ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే సినిమాల ద్వారా తెలుగు రాష్ర్టాల నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. డిస్నీ వారు తెలుగులో విడుదలచేసిన గత సినిమాల మాదిరిగానే ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి. ఇలాంటి విజువల్స్, యాక్షన్ హంగులతో కూడిన సినిమాను తెలుగు భాషలో చూసే అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. ప్రభాస్ నటిస్తే బాగుంటుంది.. హీరోగా ఇలాంటి యాక్షన్ సినిమాల్ని చేసే ఆలోచన ప్రస్తుతానికైతే నాకు లేదు. పదేళ్ల తర్వాత అవకాశం వస్తే ఆలోచిస్తాను. నాకంటే ప్రభాస్ ‘టెర్మినేటర్’ లాంటి యాక్షన్ సినిమాలు చేస్తే బాగుంటుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషలో చూడాలని అనుకుంటున్నాను. ఎమోషన్‌తో సంబంధం లేకుండా యాక్షన్ కథాంశం ఎవరినైనా మెప్పిస్తుంది.ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకముంది. హాలీవుడ్లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను. అలాగే బాలీవుడ్ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు పదిహేను రోజుల విహారయాత్ర తర్వాత ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చాను. కొన్నాళ్లుగా ఆహారనియమాలు పాటించకపోవడంతో ఐదారు కేజీల బరువు పెరిగాను. వర్కవుట్స్ చేయడానికి సిద్ధమయ్యాను. పూరి జగన్నాథ్ సినిమా యాక్షన్ హంగులతో సాగుతుంది. ఈ చిత్రం కోసం సిక్స్‌ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాను. కానీ కుదురుతుందో లేదో తెలియదు . అమ్మ సూపర్ హీరో.. నా జీవితానికి సంబంధించి మా అమ్మే సూపర్ హీరో. నేను వేసే ప్రతి అడుగులో మా అమ్మనాన్నల ఆలోచన విధానం కనిపిస్తుంది. విదేశాల్లో పిల్లల పెంపకంలో స్వేచ్ఛ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన దగ్గర మాత్రం ఓ వయసు తర్వాత తల్లిదండ్రులకు పిల్లలే ప్రపంచంగా మారిపోతారు. నా జీవితానికి అమ్మ సూపర్ హీరోగా ఉంటే నాన్న ఓ కోలిగ్‌గా ఉన్నారు. డిస్నీ ఇండియా ఇండియాహెడ్ విక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ “టెర్మినేటర్’ సిరీస్ చిత్రాల్లో జేమ్స్ కామెరూన్, ఆర్నాల్డ్ కలయికలో ఇరవై ఎనిమిదేళ్ల వస్తున్న సినిమా ఇది. హాలీవుడ్లో ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ హంగులతో ఈ సినిమా రొమాంచితంగా ఉంటుంది. సొంతం భాషలో సినిమాను చూడటంలోనే ఎక్కువ ఆనందం ఇమిడి వుంటుంది. ఆ ఆలోచనతోనే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను అనువదిస్తున్నాం’ అని చెప్పారు.