ముప్పై ఐదు అడుగుల నుంచి వంద అడుగులకు…

శుక్రవారం సాయంత్రం తమిళనాడు లోని తిరుచ్చి జిల్లా మనప్పారై గ్రామంలో ఇంటి దగ్గర ఆడుకుంటూ బోరు బావిలో పడిపోయాడు రెండున్నరేళ్ల సుజిత్. ఈ వార్త తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న సహాయక బృందాలు సుజిత్ ను సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.సుజిత్ బోరు బావిలో ముప్పై ఆరు అడుగుల లోతులో ఉన్నట్టు మొదట గుర్తించారు అయితే, సహాయక బృందాలు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తీయడం ప్రారంభించాక ముప్పై ఐదు అడుగుల దగ్గర నుంచి ఏకంగా వంద అడుగులకు జారిపోయాడు. మొత్తం ఆరు వందల అడుగుల లోతులో వేసిన బోరులో బాలుడు ప్రస్తుతం వంద అడుగుల దగ్గర చిక్కుకున్నట్లు గుర్తించి తీస్తున్న గొయ్యిని మరింత లోతుగా తవ్వటం ప్రారంభించారు.బోరు బావిలో ముప్పై ఐదు అడుగుల లోతులో సుజిత్ ఉన్నప్పుడు కాస్త ధైర్యంగా ఉన్న అతని తల్లిదండ్రులు వంద అడుగులకు జారిపోయాక కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణమొక యుగంగా గడుపుతూ అతని రాక కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి విజయ భాస్కర్ ఘటనా స్థలం లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి వస్తున్న ప్రజలు సుజిత్ క్షేమంగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. అతను క్షేమంగా బయటకు వచ్చే సందర్భం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు.

Tags:borewelltamil nadu

Leave a Response