వయసు పెరుగుతున్నా ఇంకా హ్యాండ్సమ్‌గా మారుతున్న కింగ్ నాగార్జున ‘ఫేస్ యాప్ ఛాలెంజ్’కే ఓ ఛాలెంజ్‌లాంటి వారని నెటిజన్లు అంటున్నారు. వృద్ధాప్యంలో ఎవరెలా ఉంటారో ఈ యాప్‌లో ఫొటో అప్‌లోడ్ చేసి చూసుకోవచ్చు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ‘ఫేస్ యాప్ ఛాలెంజ్’ పేరుతో అనేక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో 2002లో నాగ్ ‘మన్మథుడు’ స్టిల్, 2019లో ఫేస్ యాప్ స్టిల్‌ను పక్కపక్కన ఉంచింది. అయితే ‘మన్మథుడు 2’లో ఇంకా యంగ్‌గా ఉన్న నాగ్ ఫొటోను కూడా జత చేసింది. ఆయన అందాన్ని తగ్గించడం ఈ యాప్ తరం కూడా కాదని వర్ణిస్తూ.. ‘నాగ్ ఫేస్ యాప్ ఛాలెంజ్‌కే ఓ ఛాలెంజ్‌లాంటి వారు’ అని ట్వీట్ చేసింది. దీన్ని చూసిన కథనాయిక రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ‘నిజమే.. నాగ్ స్ఫూర్తిదాయకం.. మీకు ఇది ఎలా సాధ్యమైంది’ అని రకుల్ పోస్ట్ చేశారు.అదే విధంగా ‘ఫేస్ యాప్ ఉపయోగించిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ’ అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో అందరూ వృద్ధాప్యంతో కనిపిస్తే.. నాగ్ మాత్రం అలానే ఉన్నారు. దీన్ని మంచు లక్ష్మి షేర్ చేశారు. ‘నాగ్ విషయంలో ఇది నిజమే. ఈ ఫొటో నాకు నచ్చింది. సుశాంత్, అఖిల్, నాగచైతన్య ఇప్పటి నుంచే నాగ్ వద్ద చిట్కాలు నేర్చుకోండి. మా నాన్న విషయంలో మా పరిస్థితి ఇంతే’ అని పేర్కొన్నారు. దీంతో సదరు సంస్థ మళ్లీ మంచు ఫ్యామిలీ ఫొటోను కూడా షేర్ చేసింది.