భావితరాలకు ఉపయోగపడే ప్రజా ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగాలని తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరి అభిప్రాయాలు సేకరించి అభ్యర్థులను ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి అని అభివర్ణించారు. సుదీర్ఘ కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశామన్నారు. కార్యకర్తలు, ప్రజల అభీష్టం మేరకే రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. టికెట్ రాని వారెవ్వరూ నిరాశ చెందొద్దని, అందరి సేవలూ గుర్తించి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యం అందరికీ కల్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు.
ప్రకటించిన అభ్యర్థులందరినీ కార్యకర్తలు ఆశీర్వదించాలని అధినేత కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను కలుసుకోకుండా వెళ్తే తీవ్ర పరిణామాలుంటాయని నేతలను హెచ్చరించారు. జరిగేవి ప్రజా ఎన్నికలని, వారి మనోభావాలకు తగ్గట్టే అభ్యర్థులను ఖరారు చేశామన్నారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో పాటు, ఎవరూ చేయలేని అభివృద్ధి చేశామని ధీమా వ్యక్తంచేశారు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీలో 22 ఏళ్లు అధికారంలో ఉన్నామని గుర్తుచేశారు. అధికారానికి దూరంగా ఉన్న పదేళ్లు రాష్ట్రంలో జరిగిన అరాచకం అందరికీ తెలిసిందేనన్నారు. ఓటు మార్పు చేసి మళ్లీ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అని చంద్రబాబు తెలిపారు.