వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు, జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి (68) హఠాన్మరణం చెందారు. పులివెందులలోని ఆయన నివాసంలో ఈరోజు  తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 1950 ఆగస్టు 8న  పులివెందులలో వివేకానందరెడ్డి జన్మించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిన్నతమ్ముడైన వివేకకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004) ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి  సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో  వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో  జరిగిన ఉప ఎన్నికలో వైఎస్‌ విజయమ్మపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

వివేకానందరెడ్డి చివరిసారిగా కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైకాపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.30 వరకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన తనయుడు అశోక్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా పులివెందుల పయనం అయ్యారు. వేకువజామున వాంతులవ్వడంతో బాత్‌రూంలోకి వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఆయనొక్కరే ఉన్నారు.

Leave a Response