టాలీవుడ్ హాస్య నటుడు ‘అల్లరి’ నరేశ్ ఒక రేంజ్ లో సందడి చేస్తుంటాడు. హాస్య కథానాయకుడిగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తిచేసిన ఘనత ఆయన సొంతం. తన సినిమాల్లో ఆయన స్పూఫ్ లను ఎక్కువగా చేస్తుంటాడు. కాకపోతే అవి ఏ హీరోలను కించపరిచేలా వుండవు.
‘దొంగల బండి’ సినిమాలో తన లవర్ ముచ్చట తీర్చడం కోసం ఆయన 6 సిగరెట్ ప్యాకెట్లు పెట్టేసుకుని సిక్స్ ప్యాక్ అంటూ సందడి చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “నేను ఎక్కడ ఎదురుపడినా ప్రభాస్ ఈ సీన్ గురించి ప్రస్తావిస్తాడు. ‘ఫ్యాన్స్ కోసం మేము 6 .. 7 నెలల పాటు కష్టపడి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే, సిగరెట్ ప్యాకెట్లతో నువ్వు నీ ఫ్యాన్స్ ను మెప్పించేస్తావా? మేము ఎంతో కష్టపడి చేసిన సీన్స్ ను నువ్వు ఇంత తేలికగా చేసేస్తున్నావేంట్రా బాబూ’ అంటూ నవ్వేస్తుంటాడు అని చెప్పుకొచ్చాడు.