అలనాటి అందాల తారగా జమున అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం ‘ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య జమున ఎంపిక చేసుకుని తీసుకువెళ్ళాడు. ఇదే నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించాడు. నాటకాలలో ఆమె ప్రతిభ నలుమూలలకూ పాకడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం. తర్వాత ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. హరనాథ్ .. జగ్గయ్య వంటి స్టార్ హీరోలతో ఆమె ఎన్నో సినిమాలు చేశారు. సినీతారలుగా ఉండి, రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె అగ్రస్థానంలో ఉంటారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతుంది జమున. ఈమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి.
అలాంటి జమున తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “నాకు ఏ మాత్రం తీరిక దొరికినా, గతంలో నేను చేసిన సినిమాల్లోని పాటలను చూసుకుంటాను. నేను చేసిన సినిమాల్లోని పాటలను రెండు పెన్ డ్రైవ్ లలో వేసుకున్నాను. ప్రతిరోజు ఆ పాటలను ప్లే చేసుకుని చూస్తుంటాను.ఆయా పాటలు .. ఆ పాటల్లో నా లుక్స్ .. హావభావాలను పలికించిన తీరును చూసుకుంటాను. ‘జమున ఎంత గొప్పగా చేశావ్ .. ఎంత అందంగా వున్నావ్ .. ఎంత అదృష్టవంతురాలివే’ అంటూ నా అందాన్ని నేనే పొగుడుకుంటూ వుంటాను. అలా అలనాటి నా సినిమాల్లోని పాటలను చూసుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది .. ఉత్సాహాన్ని ఇస్తుంది” అని చెప్పుకొచ్చారు.