నాతో పనిచేయాలని అనుకోవడం గర్వంగా ఉంది

కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ఈసినిమా ద్వారా పదిమంది కలల్ని నిజం చేయడం సంతృప్తిగా ఉంది అని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వర్ధన్ దేవరకొండతో కలిసి ఆయన నిర్మించిన చిత్రంమీకు మాత్రమే చెప్తా. తరుణ్‌భాస్కర్, అభినవ్, అనసూయ, అవంతిక ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 1న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ కొత్త నిర్మాణ సంస్థ, నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా ప్రయాణం ఓ కలలా జరిగిపోయింది. గర్వం, సంతోషంతో ఈ సినిమా చేశాం. ఐదేళ్ల క్రితం సినీ ప్రముఖుల్ని కలవడానికి భయపడేవాన్ని. అబద్దం చెప్పడానికి ధైర్యం లేక స్టూడియోల ముందు నుంచి తిరిగివచ్చేవాన్ని.డబ్బులు అవసరమైతే పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయమని అప్పట్లో నాన్న సలహా ఇచ్చారు. అలాంటిది నేను నిర్మించిన సినిమాను ఆశీర్వదించడానికి ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు రావడం, నాతో పనిచేయాలని అనుకోవడం గర్వంగా ఉంది. మరొకరికి చేయూత నిచ్చి పైకి తీసుకురావాలనే ఆలోచనతో నిర్మించిన సినిమా ఇది అని అన్నారు. విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. అందరిలాగే నేను ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఘన విజయాన్ని సాధించాలని సురేష్‌బాబు తెలిపారు. దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ మాట్లాడుతూ రాకేష్ పాత్రలో తరుణ్ అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. అభినవ్, అనసూయ పాత్రలు మెప్పిస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ, అవంతిక తదితరులు పాల్గొన్నారు.

Leave a Response