అన్నిటికి నాగార్జునే కారణం అంటున‘స్టార్‌ మా’ యాజమాన్యం

ఎన్నో అంచనాలతో జూలై 22న ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3కు ఈ ఆదివారం (నవంబర్‌ 3న) శుభం కార్డు పడనుంది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగుతున్న ‘బిగ్‌’ రియాల్టీ షో ఇది. 17 మంది సభ్యులు ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారం వారం జరిగే వడపోతల్లో 12మంది ఎలిమినేట్‌ అవగా చివరికి ఐదుగురు మిగిలారు. ఎట్టకేలకు ఆట అంతిమ ఘట్టానికి చేరుకొంది. వీళ్లలో ఒకరికి మాత్రమే రూ. 50 లక్షలు గెలుచుకొనే అవకాశం ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదట్లో మూడు నాలుగు వారాలు మాత్రమే ‘బిగ్‌బాస్‌’ షోను చూసి దూరంగా జరిగిన ప్రేక్షకులు సైతం మళ్లీ టీవీల ముందుకు చేరుతున్నారు. విజేత అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయో చర్చించుకొంటున్నారు. ఇక సోషల్‌ మీడియాలో జరిగే చర్చ గురించి చెప్పక్కర్లేదు. నాగార్జునే కారణం…‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1కి జూనియర్‌ ఎన్టీఆర్‌, సీజన్‌ 2కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవ హరించారు. తమదైన శైలిలో షోను రన్‌ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచారు. ఇక మూడో సీజన్‌లో ప్రేక్షకులను అలరించడానికి, ఇంటి సభ్యుల్ని క్రమశిక్షణలో ఉంచడానికి ఎవరు అతిథిగా వస్తారా? అనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపించాయి. జూనియర్‌ ఎన్టీఆరే మళ్లీ ఆ బాధ్యత స్వీకరిస్తారని వార్తలొచ్చాయి. ఆ ఊహలకు తెర తీస్తూ వ్యాఖ్యాతగా నాగార్జున ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకుముందు ‘మా’ టీవీ నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌తో అందరినీ ఆకట్టుకొన్న నాగార్జున ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 3 వ్యాఖ్యాతగా ప్రారంభం నుంచే మంచి మార్కులు సంపాదించుకొన్నారు. తప్పు చేసిన ఇంటి సభ్యుల్ని మందలించారు. టాస్కుల్లో ప్రతిభ చాటిన వారిని అభినందించారు. ఎంతో హుందాగా ఈ షోను నిర్వహిస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని వారూ ‘బిగ్‌ బాస్‌ 3’ షోను ఆసక్తికరంగా చూస్తున్నారంటే దానికి కారణం నాగార్జునే అంటున్నాయి ‘స్టార్‌ మా’ వర్గాలు. ‘బిగ్‌ బాస్‌ 3’ పుణ్యమాని ‘స్టార్‌ మా’ పాపులారిటీలో ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలో ఉందట. బీహార్‌కు చెందిన ‘దంగల్‌ టీవీ’ ప్రథమ స్థానంలో, తమిళనాడుకు చెందిన ‘సన్‌ టీవీ’ రెండో స్థానంలో ఉన్నాయి. ఒక తెలుగు ఛానల్‌ దేశవ్యాప్తంగా మూడో స్థానంలో ఉండడం చాలా అరుదైన విషయమని టాప్‌ 5, టాప్‌ 10 లో ఉండే ఛానల్‌ ఈ స్థాయికి రావడానికి కారణం ‘బిగ్‌ బాస్‌ 3’ అని ‘స్టార్‌ మా’ యాజమాన్యం చెబుతోంది. 1108 జీఆర్‌పీ (గ్రాస్‌ రేటింగ్‌ పాయింట్స్‌)తో ‘బిగ్‌బాస్‌ 3’ రియాల్టీ షో దూసుకుపోతోంది.

Leave a Response