ఆ పాఠశాలకు వెళ్లాలంటే గొడుగుండాల్సిందే!

సాధారణంగా పాఠశాలకు వెళ్లేపుడు విద్యార్థులు తప్పనిసరిగా పుస్తకాలు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ విద్యార్థులు మాత్రం పుస్తకాలతో పాటు గొడుగు కూడా తీసుకెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఏర్పడింది. వర్షం వచ్చిందంటే చాలు ఆ పాఠశాల షవర్‌ మాదిరిగా మారిపోతుంది. విద్యార్థులు తరగతుల్లో తడిచిపోకుండా ఉండేందుకు గొడుగులు వేసుకొని కూర్చుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు.

బారాబంకిలోని రెండు పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంది. పాఠశాల భవనానికి లీకేజీ సమస్య ఉండటంతో వర్షం వచ్చిందంటే తరగతి గదులన్నీ నీరు కారుతూ ఉంటాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తడిచిపోకుండా గొడుగులు వేసుకొని గదుల్లో కూర్చుంటారు. గదులు లీక్‌ కావడంతో అక్కడకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. పాఠశాల పరిస్థితిని పట్టించుకొని దాన్ని బాగు చెయ్యాల్సిందిగా పలుమార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా.. వాళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

Leave a Response