ఎవరిని నమ్మాలి.. మోదీనా.. బ్యాంకులనా?

తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తానన్న బ్యాంకులు తీసుకోవడం లేదంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విజయ్‌ మాల్యా తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ సారి ఏకంగా ప్రధాని మోదీపైనే ఆరోపణలు చేశారు. తాను చెల్లించే బకాయిల విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారా లేదా బ్యాంకులు చెబుతున్నాయా అర్థం కావడం లేదని విమర్శించారు.

‘బ్యాంకులకు నేను(మాల్యా) చెల్లించాల్సిన రుణాల కంటే ఎక్కువగానే ప్రభుత్వం రికవరీ చేసుకుందని స్వయంగా భారత ప్రధాని నరేంద్రమోదీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ కొన్ని బ్యాంకులు ఇంగ్లీష్‌ కోర్టుల్లో ఇందుకు పూర్తి విరుద్ధంగా చెప్పాయి. ఎవరిని నమ్మాలి? అయితే మోదీ లేదా బ్యాంకులు ఎవరో ఒకరు అబద్ధం చెప్పి ఉండాలి’ అని మాల్యా ట్వీట్‌ చేశారు.

ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి లండన్‌లో ఉంటున్నారు. అతడిని భారత్‌కు అప్పగించే విషయమై లండన్‌ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. రుణాలు చెల్లించే విషయంలో సెటిల్‌మెంట్‌కు రావాలని మాల్యా బ్యాంకులను కోరారు. అయితే ఇందుకు బ్యాంకులు ఒప్పుకోకపోవడంతో విమర్శలు చేస్తూ వస్తున్నారు.

మరోవైపు లండన్‌లో ఉన్నా భారత్‌లో జరిగే విషయాలపై మాల్యా స్పందిస్తున్నారు. ఇటీవలే జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ సంక్షోభంపై స్పందిస్తూ ప్రభుత్వం, బ్యాంకులపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

Leave a Response