సారీరా… తప్పలేదు: నాని……

నేచురల్‌ స్టార్‌ నాని తన కుమారుడికి సారీ చెబుతున్నారు. నాని కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జెర్సీ’. ఇందులో ఆయన అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. నాని కుమారుడి పేరు కూడా అర్జునే. శుక్రవారం సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని సోషల్‌మీడియాలో ఓ అపురూపమైన ఫొటోను పోస్ట్‌ చేశారు. సముద్రం ఒడ్డున తన కుమారుడితో కూర్చుని కబుర్లు చెబుతున్నట్లుగా ఉన్న ఆ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నాని వేసుకున్న టీషర్ట్‌పై అర్జున్‌ అని రాసుంది. అర్జున్‌ వేసుకున్న టీషర్ట్‌పై ‘మా నాన్న నా పేరు దొంగిలించారు’ అని రాసుంది. దాంతో.. ‘సారీ రా జున్నూ.. (అర్జున్‌ ముద్దు పేరు). తప్పలేదు’ అని నాని క్యాప్షన్‌ ఇచ్చారు. అంటే.. సినిమాలో తన కుమారుడి పేరు వాడుకున్నందుకు అర్జున్‌కు నాని సారీ చెబుతున్నారన్నమాట. ఈ ఫొటోను పోస్ట్‌ చేసిన కొద్దిసేపటికే మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ‘సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అన్నా..’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సినిమాలో నాని కుమారుడి పాత్రలో నటించిన చిన్నారి పేరు కూడా నానినే. ‘జెర్సీ’ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. సినిమాను మాజీ క్రికెటర్‌ రమణ్‌ లాంబా జీవితాధారంగా తెరకెక్కించినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. అది నిజం కాదని నాని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈ సినిమాతో తనకు క్రికెట్‌ అంటే ఏంటో పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు.

Leave a Response