104 డిగ్రీల జ్వరంతో చిరంజీవి ఆ పాట చేశారు

అగ్ర కథానాయకుడు చిరంజీవికి వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఇప్పటి తరంలో చాలా తక్కువ మందికి ఉందని సీనియర్‌ నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఆయన చిరుతో కలిసి పలు చిత్రాల కోసం పనిచేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజా రవీంద్ర చిరుతో తన ప్రయాణంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘మెగాస్టార్‌’కు వృత్తిపట్ల ఉన్న అంకితభావం గురించి ఉదాహరణగా కొన్ని సంఘటనలు చెప్పారు.
‘‘ఠాగూర్‌’లో ‘కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి..’ పాట షూట్ సమయంలో చిరంజీవికి బాగా వెన్నునొప్పి వచ్చింది. ఆయన తన క్యారవాన్‌ దగ్గరికి వెళ్లారు. చిరు ఇంకా రాలేదేంటని డ్యాన్స్‌ మాస్టర్‌ అంటుంటే నేను చూడటానికి వెళ్లా. ఆయన బాగా నొప్పితో బాధపడుతున్నారు. ‘నాకు నొప్పిగా ఉందని మాస్టర్‌కు చెప్పొద్దు.. చెబితే అప్‌సెట్‌ అవుతారు’ అని చిరు నాతో చెప్పి.. ఆ రోజంతా షూటింగ్‌‌ చేశారు. దీంతో చికిత్స కోసం రాత్రికి రాత్రే ఆయన్ను అమెరికాకు పంపించాల్సి వచ్చింది. ఈ సంఘటనను మర్చిపోలేను’.

‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ షూటింగ్‌ సమయంలో చిరంజీవికి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో సినిమా ఆగిపోకూడదని అలానే మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. అప్పుడు ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ..’ పాట షూట్‌ జరిగింది. అది పూర్తి చేసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లారు. కేవలం రెండు రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆయన మెగాస్టార్‌.. ‘నా వల్ల కాదు’ అని చెబితే తిరిగి ప్రశ్నించే వారే ఉండరు. కానీ ఆయన ఎప్పుడూ అలా చేయలేదు.’’

‘‘నటన అనగానే చిరు చాలా ఉత్సాహంగా ఫీలవుతారు. కెమెరా ముందుకు వెళితే ఆయనలో కొత్త ఉత్తేజం వచ్చేస్తుంది. ఆయన అప్పట్లో ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలానే ఉన్నారు. అప్పుడు ఆయన సినిమాలు ఎలా వసూళ్లు రాబట్టేవో.. ఇప్పుడు కూడా అలానే రికార్డు స్థాయిలో వసూలు చేస్తున్నాయి. సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు, అంకితభావంతో పనిచేస్తారు’’ అంటూ ‘చిరు’ విశేషాలను పంచుకున్నారు.

Leave a Response