దాసరి ఆస్తి వివాదం పరిష్కరించలేకపోయా

పలు కారణాల వల్ల దర్శకరత్న దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని దాసరి శిష్యుడు, ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో దాసరి లఘు చిత్రాల బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటులు జయసుధ, ఆర్.నారాయణమూర్తితోపాటు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లఘు చిత్రాల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులను, పలువురు నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో దాసరి మహావృక్షం లాంటివారని కొనియాడారు. దాసరి వీలునామాలో తనతోపాటు మురళీమోహన్ పేరు రాసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారని, కానీ అది కొంత వరకు సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు. దాసరికి కేంద్రం భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. తన మామయ్య దాసరి ఆస్తి పంపకాల్ని మోహన్‌బాబు చేతుల్లో పెట్టారని ఇటీవల ఆయన కోడలు సుశీల అన్నారు. ఈ విషయంలో మోహన్‌బాబు తమకు అన్యాయం చేశారని కూడా ఆమె ఆరోపించారు.

Leave a Response