భారత దేశ ప్రధాన మంత్రిగా మోదీ….

గురువారం వెల్లడైన లోక్‌ సభ ఫలితాల్లో ప్రధాని మోదీ సారథ్యంలోని భాజపా 303 స్థానాలు కైవసం చేసుకుంది. ఎన్డీయే పక్షాలతో కలిసి 352  సీట్లు గెలుచుకుంది. దీంతో తిరిగి రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని కానున్నారు. ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా భాజపా సీనియర్‌నేతలైన మురళీ మనోహర్‌ జోషీ, ఎల్‌.కె. ఆడ్వాణీలతో మోదీ, అమిత్‌ షా భేటీ అయ్యారు. భాజపా విజయాన్ని వారితో పంచుకున్నారు.భారత దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ తంతు కంటే ముందు ఆయన ఈనెల 28న వారణాసిలో పర్యటిస్తారు. అక్కడ ఆయన భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 28న వారణాసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. 29న సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటిస్తారు. అక్కడ తన తల్లి హీరాబెన్‌ వద్ద ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

Leave a Response