పారితోషికం పెంచిందట

డిమాండ్‌ ఉంటే రేటు పెరుగుతోంది. ఇది వ్యాపార లక్షణం. నటన అనేది వృత్తి అయినా, సినిమా కూడా వ్యాపారమే కాబట్టి డిమాండ్‌ అండ్‌ సప్‌లై అనేది ఈ రంగంలోనూ వర్తిస్తుంది. అయితే ఇక్కడ విజయాలే కొలమానం. నటి సమంత ఇదే కొటేషన్‌ను పాటిస్తోంది. ఇతర కథానాయికలకు సమంతకు వ్యత్యాసం ఉంది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి అయిన తరువాత సైడైపోతారు. ఒక వేళ మళ్లీ నటించడానికి సిద్ధం అయినా అక్క, వదిన లాంటి పాత్రలకే పరిమితం అవుతుంటారు. అయితే నటి సమంత మాత్రం పెళ్లయిన తరువాత కూడా హీరోయిన్‌గా రాణిస్తోంది. అదీ మరింత క్రేజీగా,   సక్సెస్‌ఫుల్‌గా. నిజం చెప్పాలంటే వివాహానంతరమే సమంత కేరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన తెలుగు చిత్రం మజిలీ మంచి విజయాన్ని అందుకుంది.

ఇక తమిళంలో చాలా ధైర్యం చేసి నటించిన సూపర్‌ డీలక్స్‌ చిత్రంలోనూ తన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో చాలా చర్చనీయాంశ పాత్రలో నటించింది. ఇక వివాహానంతరం గ్లామరస్‌గా నటించడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం కూడా సమంత క్రేజ్‌ పెరగడానికి ఒక కారణం కావచ్చు. ఈ అమ్మడు ప్రస్తుతం ఇరానీ చిత్రానికి రీమేక్‌ అయిన ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉంది. అదేవిధంగా తమిళంలో సంచలన విజయం సాధించిన 96 చిత్ర రీమేక్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా మన్మధుడు–2 చిత్రంలో తన మామ నాగార్జునతో కలిసి నటించడానికి రెడీ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈ చిత్రానికి తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందనేది ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. నటి సమంత ఇప్పటివరకూ రూ.2 కోట్లు పారితోషికం పుచ్చుకుంటుందట. ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా రూ.3కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు టాక్‌. తన మామ నాగార్జునతో నటించనున్న మన్మధుడు–2 చిత్రానికి రూ.3 కోట్లు డిమాండ్‌ చేయగా నిర్మాతలు అందుకు ఓకే అన్నట్టు సమాచారం.

Leave a Response