తొలి దర్శకుడితో.. 25వ చిత్రం!

జెర్సీ’ చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న నేచురల్‌ స్టార్‌ నాని.. తన తదుపరి ప్రాజెక్ట్‌ విషయాలను ప్రకటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో సుధీర్‌బాబు మరో కథానాయకుడిగా నటించనున్నారు. ఈ సినిమా లోగోను నాని ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఎరుపు రంగులో ‘v’ అని రాసున్న ఈ సినిమా లోగో ఆసక్తికరంగా ఉంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సినిమా నేపథ్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
‘మోహనకృష్ణ నా తొలి చిత్రంతో నన్ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఈరోజు నా 25 చిత్రంతో మళ్లీ పరిచయం చేయబోతున్నారు. కాకపోతే ఈసారి కాస్త విభిన్నంగా.. నా స్నేహితుడు(సుధీర్‌బాబును ఉద్దేశిస్తూ) కూడా పార్టీ (సినిమా)లో చేరబోతున్నాడు’ అని పేర్కొన్నారు.
సుధీర్‌బాబు కూడా సినిమా గురించి ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘సినిమాలో ఉన్న ఎన్నో ట్విస్ట్‌లలో ఇది మొదటి ట్విస్ట్‌. వెల్‌కమ్‌ నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించబోయే ఈ చిత్రం నుంచి ఊహించలేని విషయాలు మీ ముందుకు రాబోతున్నాయి’ అని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తోంది. అదితి రావు హైదరి, నివేదా థామస్ కథానాయికలుగా నటించనున్నారు. అమిత్‌ త్రివేది సంగీతం అందించనున్నారు. 

Leave a Response