నా జీవితాన్నే మార్చేసింది : రానా

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి… కలెక్షన్ల వర్షం కురిపించింది బాహుబలి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలు ఎంత పెద్ద హిట్టయ్యాయో .. ఆ సినిమాలోని నటీనటులు అంతే స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఈ సినిమాతో హీరో ప్రభాస్‌తో పాటు స్టార్‌ వారసుడు రానా దగ్గుబాటి కూడా విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోకుండా విలక్షణ పాత్రలు ఎంచుకుంటున్న రానా.. భల్లాలదేవ పాత్రతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. కాగా బాహుబలి: ద కన్‌క్లూజన్‌ విడుదలై ఆదివారం నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా రానా ఆనందం వ్యక్తం చేశాడు. ‘ రెండేళ్ల క్రితం ఇదే రోజు నా జీవితాన్ని మార్చివేసింది. చిరస్థాయిగా నిలిచిపోచే భారతీయ సినిమా బాహుబలి’ అంటూ బాహుబలి 2 పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీంతో రీట్వీట్లు, లైకులతో బాహుబలి సాగా అభిమానులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. అదే విధంగా బాహుబలి తర్వాత రానా ఇతర సినిమాల విడుదల జాప్యంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల నుంచి ఏం చేస్తున్నారు బ్రో అంటూ రానాను ప్రశ్నిస్తున్నారు.

ఇక కొద్ది రోజులు క్రితం రానా ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. రానా తండ్రి సురేష్‌ బాబు కూడా రానా చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించాడు. తాజాగా రానా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కం‍టపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్‌ మరోసారి చర్చకు దారి తీస్తోంది. బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్‌ అవుతున్నారు. ప్రస్తుతం హాథీ మేరే సాథీ, విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న రానా ఆ సినిమాల కోసం ఇలా బరువు తగ్గాడా? లేక హెల్త్‌ ప్రాబ్లం కారణంగా తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.

Leave a Response