అభిమానుల కోణంలో ఆలోచించి స్క్రిప్టుఎంచుకుంటానని కథానాయకుడు ప్రభాస్ అన్నారు. ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆయన తన కెరీర్ గురించి ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. ‘బాహుబలి’ సినిమాకు విశేషమైన స్పందన లభించడం తన అదృష్టమని అభిప్రాయపడ్డారు. ‘ప్రేక్షకులు నన్ను ఇంతగా ప్రేమించి, ఆదరించడం నా అదృష్టం. ప్రజలు నా నుంచి చాలా ఆశిస్తున్నారు. నా నుంచి ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రతి ప్రాజెక్టు వారి అంచనాలకు తగ్గట్టు ఉండేలా చూసుకుంటా’.
‘నేను స్క్రిప్టు ఎంచుకునేటప్పుడు.. నా అభిమానులు నన్ను ఎలాంటి పాత్రలో, కథలో చూడాలనుకుంటున్నారని ఆలోచిస్తా. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటా. అదంతా స్క్రిప్టు మీద ఆధారపడి ఉంటుంది. నేను పాత్రలోకి లీనమైపోగలనా, అందులో జీవించగలనా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటా’ అని ప్రభాస్ పేర్కొన్నారు.
‘డార్లింగ్’ ప్రస్తుతం ‘సాహో’ సినిమాలో నటిస్తున్నారు. ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ త్రయం సంగీతం అందిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.