సినిమా నుంచి తప్పుకొంటానని హెచ్చరించిందా?

హైదరాబాద్‌: కథానాయిక సాయి పల్లవి ‘విరాట పర్వం’ సినిమా నుంచి తప్పుకొంటానని చిత్రబృందాన్ని హెచ్చరించారట. ఈ మేరకు ఆమెపై టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’ చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారు. ఇందులో సాయి పల్లవిని కథానాయికగా ఎంచుకున్నారు. అయితే సినిమా చిత్రీకరణ ఎప్పుడో మొదలుకావాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కడం ఆలస్యమవుతోంది. మరోపక్క సాయి పల్లవి చేతి నిండా ఇతర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. దాంతో ఆమె అటు వేరే సినిమాలను వదులుకోలేక సతమతమవుతున్నారట.
త్వరగా డేట్లు కుదుర్చుకోవాల్సిందిగా ఇదివరకే చిత్రబృందాన్ని సాయి పల్లవి కోరినట్లు తెలుస్తోంది. ఇక చేసేదేంలేక సినిమా చిత్రీకరణ త్వరగా మొదలుపెట్టకపోతే తప్పుకొంటానని అన్నట్లు ఫిలిం వర్గాల సమాచారం. ‘విరాటపర్వం’కు వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేశ్‌ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక టబు ఓ కీలక పాత్రలో సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళ పాత్రని పోషిస్తున్నట్టు సమాచారం. టబుతో పాటు ఇందులో మరో కథానాయిక ప్రియమణి కూడా కీలక పాత్ర కోసం ఎంపికైనట్టు తెలిసింది.

Leave a Response