ఇద్దరు నాయికలతో?

మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారా? అవుననే అంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రస్తుతం ఆ ఇద్దరు భామల ఎంపిక పైనే దృష్టిపెట్టినట్టు సమాచారం. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర కథానాయికల పేర్లని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమందిని ఫొటో షూట్‌ కోసం ఆహ్వానించినట్టు సమాచారం. రామ్‌చరణ్‌కి జోడీగా ఇప్పటికే బాలీవుడ్‌ భామ ఆలియాభట్‌ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ కోసం బ్రిటిష్‌ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ని ఖాయం చేసినప్పటికీ, ఆమె కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొన్నారు. దాంతో డైసీ స్థానంలో ఒక కథానాయికతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో ఎన్టీఆర్‌తో కలిసి కనిపించనున్న మరో నాయిక కోసం రాజమౌళి అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరించనున్న కీలక సన్నివేశాల కోసం ఇద్దరు కథానాయకులు సన్నద్ధమవుతున్నారు.

Leave a Response