ఎయిర్‌పోర్టులో కుమార్తెకు సెండాఫ్‌ ఇచ్చి వస్తుండగా..

ఉన్నత చదువుల కోసం కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపేందుకు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో సెండాఫ్‌ ఇచ్చి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా ఘన్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హన్మకొండ బాలసముద్రంకు చెందిన ఝాన్సీరాణి(45) మృతిచెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక ఎస్సై రవి కథనం ప్రకారం… హన్మకొండ బాలసముద్రంకు చెందిన వీరారెడ్డి, ఝాన్సీరాణి దంపతుల కుమార్తె కృష్ణశ్రేయను ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు పంపించేందుకు ఝాన్సీరాణి తల్లిదండ్రులైన హేమలత, సుదర్శన్‌రెడ్డితో కలిసి ఐదుగురు కారులో హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు ఆదివారం వెళ్లారు.

సోమవారం తెల్లవారుజామున కృష్ణశ్రేయను ఫ్లైట్‌ ఎక్కించిన తర్వాత నలుగురు తిరిగి హన్మకొండకు బయల్దేరారు. వీరారెడ్డి కారు డ్రైవింగ్‌ చేస్తుండగా పక్క సీట్లో ఝాన్సీరాణి, అచ్చాయమ్మ, సుదర్శన్‌రెడ్డి వెనుక సీట్లో కూర్చున్నారు. ఈ క్రమంలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘన్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఝాన్సీరాణితోపాటు మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రవి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గాయపడ్డ వారిని చికిత్సనిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఝాన్సీరాణి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలిపారు. మిగిలిన వారు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.

Leave a Response