సీఎం రేసు నుంచి నితీశ్‌ తప్పుకుంటారు!

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ 2020 తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టరని కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి, రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగే ఉద్దేశం నితీశ్‌కు లేదని స్వయంగా ఆయనే తనకు వ్యక్తిగతంగా చెప్పినట్లు తెలిపారు. ‘‘ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై నేను ఎలాంటి రాజకీయ సెటైర్లు వేయడం లేదు. 2020 ఎన్నికల నుంచి తనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే ఉద్దేశం లేదని స్వయంగా ఆయనే కొద్ది నెలల క్రితం నాతో అన్నారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని పాలించాను. ఇంకా ఎంతకాలం కొనసాగాలి అన్నారు.’’ అని పట్నాలో నిర్వహించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జన్మదిన వేడుకలో ఆయన వెల్లడించారు.

కుష్వాహా ఉన్నట్టుండి ముఖ్యమంత్రిపై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధ్యాన్యం సంతరించుకుంది. అయితే నితీశ్‌ కుమార్‌ బిహార్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నుంచి పోటీ చేయబోరనే విషయంపై జేడీయూ నేతలెవరూ ఇంతవరకూ ఎక్కడా మాట్లాడలేదు. మరోవైపు కుష్వాహా వ్యాఖ్యలను జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్‌ కొట్టిపారేశారు. నితీశ్ ‌నాయత్వాన్ని ప్రజలు, ప్రజాప్రతిధులు బలంగా కోరుకుంటున్నారని అన్నారు.

నితీశ్‌ కుమార్‌ గురించి కుష్వాహా ఈ తరహాలో వ్యాఖ్యానించడం ఇది మొదటిసారి కాదు. 2020 ఎన్నికల్లో ఎన్డీయే-జేడీయూ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ను ఎలా నిలబెడతారని జులైలో ఆయన ఓ సందర్భంలో ప్రశ్నించారు. గతంలో జేడీయూలో ఉన్న కుష్వాహా 2013లో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆయన ఆర్‌ఎల్‌ఎస్‌పీని స్థాపించి ఎన్డీయేతో చేతులు కలిపారు.

Leave a Response