ఆ విషయం కేసీఆర్‌కు కూడా చెప్పలేదు

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ను తనకంటే బాగా ఎవ్వరూ తీయలేరని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ‘టైగర్‌ కేసీఆర్‌’ పేరుతో ఆయన ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వర్మ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దాంతో తెలంగాణ వాసుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.                                                                                                                                                                                 
కేసీఆర్‌లో గాంధీ కనిపించారు 
నాకు కేసీఆర్‌లో జాతిపిత మహాత్మా గాంధీ కనిపించారు. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రుల నుంచి వేరై తెలంగాణ వాసుల కోసం ఓ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా కేసీఆర్‌ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ‘నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తాను’ అని గతంలో కేసీఆర్‌ చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అందుకే.. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అన్న ఉపశీర్షిక పెట్టాను. ఆయన తెలంగాణను తేవడానికి ఏం చేశారు?ఎవరి ద్వారా తీసుకొచ్చారు? ఇవన్నీ ప్రజలకు తెలిసిన అంశాలే. నేను సినిమాలో ఇవన్నీ చూపించాలనుకోవడం లేదు. ఆ కృషి వెనుక ఉన్న కథను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను.
ఆ సన్నివేశాలు స్కిప్‌ చేయలేను
తెలంగాణ తేవడానికి కేసీఆర్‌ ఎన్నో ఏళ్లు కష్టపడ్డారు. ఇదో ఉద్యమంలా జరిగింది. అంత పెద్ద ఉద్యమాన్ని తెరపై తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే సినిమాకు అదే కీలకం. దానిని నేను స్కిప్‌ చేయలేను. కొన్ని గ్రాఫిక్స్‌లో చూపించాలనుకుంటున్నాను. మరికొన్ని నిజంగానే ఆర్టిస్ట్‌లను పెట్టించి తీయాలనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూడాలి.
నాకంటే బాగా ఎవ్వరూ తీయలేరు                                                                                                                                
‘కేసీఆర్‌ టైగర్‌’ సినిమాను నా కంటే బాగా ఎవ్వరూ తీయలేరని మాత్రం చెప్పగలను. మామూలుగా బయోపిక్‌లు ఎవరైనా తీస్తారు. ఎందుకంటే.. ఎవరైనా కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలనుకుంటే ఆయన ఎక్కడ పుట్టారు? ఏ స్కూల్‌కి వెళ్లారు? ఇలా బేసిక్‌ సమాచారంతో తీయాలనుకుంటారు. కానీ అది ప్రధాన పాయింట్‌ కాదు. ఆయన ఎందుకు గొప్పవారయ్యారు? అన్నది ప్రజలకు తెలియాలి.
కేసీఆర్‌ లాంటి హీరోను చూడలేదు         
కేసీఆర్‌ బయోపిక్‌ భారీ బడ్జెట్‌తో తీయాల్సిన సినిమా కాబట్టి అలాగే తీయాలి. లేకపోతే తీయకూడదు. ఓ చారిత్రక డాక్యుమెంటరీగా ‘టైగర్‌ కేసీఆర్‌’ను తెరకెక్కించాలనుకుంటున్నాను. నేను ఈ సినిమాను సీరియస్‌గా తీయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో నేను కేసీఆర్‌లాంటి హీరోను ఎప్పుడూ చూడలేదు.                                                                                                                                                                                                                                                                                                                       అందుకే ‘ఆడు’ అన్న పదం వాడా..
‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అన్న ట్యాగ్‌లైన్‌ వెనకున్న అర్థమేంటంటే.. వాడేం చేస్తాడు? ఏం చేయగలడు? అని ఎవరైనా ఓ వ్యక్తిని తక్కువ చేసి చూసినప్పుడు.. సదరు వ్యక్తి అనుకున్నది సాధించేసిన తర్వాత ‘అరె.. అనుకున్నది చేసేశాడే’ అని షాకవుతాం. నా ట్యాగ్‌లైన్‌ వెనకున్న అర్థం కూడా అదే. ఒకప్పుడు కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన సాధించేశారు. నేను అమర్యాదకరంగా కేసీఆర్‌ను ‘ఆడు’ అనలేదు. ప్రేమతో అన్నమాటది. అది సినిమాలోని డైలాగ్‌. ఆ డైలాగ్‌ ఎవరన్నారు? అన్నది మీరు సినిమాలోనే చూడాలి.
కేసీఆర్‌కు చెప్పలేదు 
బయోపిక్‌ తీస్తున్నానని నేను ట్విటర్‌లో ప్రకటించాను. కానీ కేసీఆర్‌ను ఎప్పుడూ ట్యాగ్‌ చేయలేదు. చెప్పాలంటే సినిమా తీస్తున్నానని ఆయనకుకూడా చెప్పలేదు.
కొత్త నటుడినే ఎంపికచేసుకుంటాను   
నేనింకా ‘కేసీఆర్‌’ పాత్రలో ఎవరు నటించాలన్న విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగతా నటీనటులను కూడా అనుకోలేదు. అయితే ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. కేసీఆర్‌ పాత్రలో ఇప్పటివరకు ఎవ్వరూ నటించని వ్యక్తినే నేను తెరపై చూపించబోతున్నాను. నేను థియేటర్‌ ఆర్టిస్ట్‌ను ఎంపికచేసుకుంటున్నాను. నా అభిప్రాయంలో ఓ రియలిస్టిక్‌ సినిమాను తీసేటప్పుడు అందులో కొత్త నటులను ఎంపికచేసుకుంటేనే ఆ సినిమా వర్కవుట్‌ అవుతుంది. ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. 

Leave a Response