మా పిల్లలకు ఈ కథ తప్పకుండా చెప్తా

తనకు పుట్టబోయే పిల్లలకు తన ప్రేమకథను తప్పకుండా చెబుతానని అంటున్నారు గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా. 2017లో అమెరికాలోని లాస్ఏంజెల్స్‌లో జరిగిన ‘మెట్‌ గాలా’ అనే కార్యక్రమంలో ప్రియాంక.. అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ను కలిశారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లు డేటింగ్‌ చేసిన అనంతరం పెద్దల సమక్షంలో గతేడాది డిసెంబర్‌లో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ ఏడాది జరగబోయే ‘మెట్‌ గాలా’ కార్యక్రమం సోమవారం(అమెరికా కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా రెండేళ్ల క్రితం తాను నిక్‌తో కలిసి కార్యక్రమంలో దిగిన ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోపై ‘మా పిల్లలకు ‘మీ తండ్రిని ఎలా కలిశానంటే..’ అన్న కథను తప్పకుండా చెబుతాను’ అని పేర్కొంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మరి ఈ ఏడాది జరగబోయే ‘మెట్‌ గాలా’ కార్యక్రమంలో ప్రియాంక, నిక్‌ ఎలాంటి దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై మెరవబోతున్నారో వేచి చూడాలి.  

Leave a Response