సీనియర్ జర్నలిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న బీకే ఈశ్వర్ మాట్లాడుతూ “నేను ‘విజయచిత్ర’ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయనలో పట్టుదల ఎక్కువనే విషయం నాకు అర్థమైంది. తొలినాళ్లలో ఏఎన్నార్ జానపద చిత్రాల్లో ఎక్కువగా చేయడంతో ఆయన జానపదాలు మాత్రమే చేగలడనే ప్రచారం జరిగింది. ‘సంసారం’ అనే సాంఘిక చిత్రంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపించి ఆ నిందను పోగొట్టుకున్నారు. ‘దేవదాసు’ తరువాత ఏఎన్నార్ కి ట్రాజెడీ కింగ్ అనే పేరు వచ్చింది. ‘మిస్సమ్మ’లో కామెడీ చేశారు. ‘భూకైలాస్’లో నారదుడిగాను మెప్పించారు. ఇలా అక్కినేని ఏ పాత్రనైనా చేయగలరని అంతా అనుకోవడానికిగాను ఆయన ఎంతో శ్రమించారు” అని అన్నారు.