ఏపీ నుంచి తెలంగాణకు మద్యం ప్రియులు

ఏపీ నుంచి తెలంగాణకు మందుబాబులు క్యూకడుతున్నారు. ఏపీలో మద్యం ధరలు పెరగడం, రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతుండడంతో అల్లాడిపోతున్న సరిహద్దు గ్రామాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.ఏపీలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ పల్లెల్లో ఉన్న మద్యం దుకాణాలపై పడుతున్నారు. దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది.కొందరు ఇదే అదునుగా అక్రమ అమ్మకాలకు తెరతీశారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన మద్యాన్ని స్థానికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం నందిగామ ఎక్సైజ్ అధికారులు ఇలా అక్రమంగా తీసుకొచ్చిన 203 మద్యం సీసాలను పట్టుకున్నారు. చందర్లపాడుకు చెందిన యంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

Leave a Response