యువి గురించి చెప్పాలంటే అవి మాటల్లో చెప్పలేం. ఒక పుస్తకమే రాయవచ్చు. తన కెరియర్ లో చాల ఒడిదుడుకులు ఎదుర్కొని, అతని గురించి చెప్పాలంటే, అది 2000 ఛాంపియన్స్ ట్రోఫీ.. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను అభిమానులను కుదిపేశాక టీమ్ఇండియా ఆడిన తొలి టోర్నీ అది. కొత్త కెప్టెన్ సౌరబ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు ఫిక్సింగ్ నుంచి అభిమానులను ఆటపైకి మళ్లించాలని, మళ్లీ వారి మనసులు గెలవాలని పట్టుదలతో టీం ఇండియా టోర్నీ బరిలోకి దిగింది. ఆస్ట్రేలియాతో భారత్‌కు క్వార్టర్‌ఫైనల్. మొదట భారత్‌దే బ్యాటింగ్. 90 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. అందులో సచిన్, గంగూలీ, ద్రవిడ్ ఔటైపోయారు. అప్పుడే క్రీజులోకి వచ్చాడు ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఇటు చూస్తే జట్టు కష్టాల్లో ఉంది.. అటు చూస్తే మెక్‌గ్రాత్, బ్రెట్ లీ, బౌలింగ్ భయపెడుతోంది. కానీ ఇంత ఒత్తిడిలో ఆ కుర్రాడు.. ఏ తడబాటూ లేకుండా వారిని ఎదుర్కొన్న తీరును.. ఆడిన షాట్లను.. మొత్తంగా అతడి ఇన్నింగ్స్‌ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు! ఆ ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచమంతటా అతడి పేరు మార్మోగిపోయింది. ఇక అతను వెనుదిరిగి చూసుకున్నది లేదు.
అంతర్జాతీయ క్రికెట్లో యువీ తొలి ఇన్నింగ్సే ఒక సంచలనం గా మలిచాడు.. ఇక ఆ తర్వాత నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో కైఫ్‌తో కలిసి అద్భుత రాణించారు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. 2011 ప్రపంచకప్‌లో బ్యాటుతో, బంతితో ఆల్‌రౌండ్ మెరుపులు.. ఇలా చెప్పుకోవడానికి యువీ కెరీర్లో చాల అద్భుత ఘట్టాలెన్నో ఉన్నాయి. సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలకు దీటుగా ఆటగాడిగా ఒక స్థాయి, భారీగా అభిమానలను ఉన్న గొప్ప క్రికెటర్లలో యువరాజ్ ఒకడు అనడంలో సందేహం లేదు. భారత పరిమిత ఓవర్ల మ్యాచ్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో అతనొకడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల భారత అభిమానులకు లెక్కలేనన్ని సార్లు అపరిమిత వినోదాన్ని అందించిన ఘనత యువీ మాత్రమే సొంతం. చిన్న ఇన్నింగ్సే ఆడినా.. కాసేపు గ్రౌండ్లో ఉన్నా.. యువీ బ్యాటింగ్‌లో ఉండే మజానే వేరు.
నేరుగా టాప్ గేర్‌తో కెరీర్‌ను మొదలుపెట్టిన యువరాజ్. దశాబ్దం పాటు భారత వన్డే జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. తక్కువ మ్యాచ్‌ల్లోనే మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మన్‌గా కనిపించాడు. బౌలింగ్ పార్ట్‌టైం స్పిన్నర్‌గా మొదలుపెట్టి.. ప్రతి మ్యాచ్‌లోనూ 10 ఓవర్ల కోటా పూర్తి చేసే స్పిన్నర్‌గా రూపాంతరం చెందాడు యువి. ఇక భారత జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాల్ని ఎంతగానో పెంచి.. ఈ విషయంలో తర్వాతి తరం క్రికెటర్లకు రోల్‌మోడల్‌గా నిలిచిన ఘనత కూడా యువీకి చెందుతుంది.