గిరీష్‌ కర్నాడ్‌ కన్నుమూత….

ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్(81) కన్నుమూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు.1963లో ఆక్స్‌ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయన ఏడేళ్ల పాటు ఆక్స్‌ఫర్డ్‌లోనే ఉన్నారు. తరువాత అమెరికా చేరుకుని యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో చదువుకున్నారు. అనంతరం భారత్ తిరిగి వచ్చి, చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌లో ఉద్యోగంలో చేరారు. అక్కడ తన రచనావ్యాసంగాన్ని కొనసాగించడంతోపాటు థియేటర్‌పై కూడా దృష్టి పెట్టారు. తరువాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమాలవైపు మళ్లారు. ‘తుగ్లక్’, ‘అంజు మల్లిగె’, ‘అగ్నిమతు మాలె’, ‘నగా మండల్’ తదితర నాటకాలు గిరీష్ కర్నాడ్‌కు ఎంతో పేరుతెచ్చిపెట్టాయి. గిరీష్ కర్నాడ్ తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘కొమరంపులి’ తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తెలుగులో ‘స్కెచ్ ఫర్ లవ్’ సినిమాలో నటిస్తున్నారు. గిరీష్ కర్నాడ్ 19 మే 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలు నాటకాలు రచించి ఆయన వెలుగులోకి వచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే చిత్రం ద్వారా ఆయన సినిమాల్లో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో ఆయన నటించారు.

Image result for girish


జంధ్యాల దర్శకత్వంలో 1983లో తెరకెక్కిన ఆనందభైరవి చిత్రంతో కర్నాడ్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. శంకర్ దాదా-ఎంబీబీఎస్, కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్, ధర్మచక్రం తదితర తెలుగు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాకుండా.. బుల్లితెరపై సంచలన విజయం సాధించిన ‘మాల్గుడి డేస్’ అనే సీరియల్‌లోనూ ఆయన నటించారు. చివరిగా అప్నా దేశ్ అనే కన్నడ సినిమాలో ఆయన నటించారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 26న విడుదలకానుంది. మద్రాస్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పని చేస్తున్న సమయంలో డా.సరస్వతి గణపతిని ఆయన ఓ పార్టీలో కలుసుకున్నారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత వాళ్లు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం.

Leave a Response