పీజే హైదరాబాద్ అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంలో ఇద్దరు తెలుగు సీఎం లు బిజీ గా ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారని సమాచారం. ఇప్పటికే సుమారు 5 సార్లు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలో కూడా చర్చించారు. దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు ఇద్దరు సీఎంలు సన్నద్ధమయ్యారు. వారి మధ్య తొలి ఉన్నతస్థాయి సమావేశం శుక్రవారం ఉదయం 10.00 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మొదలుకానుంది. ముఖ్యంగా గోదావరి వరద జలాల తరలింపు, కృష్ణా, గోదావరి బేసిన్లలో నీటిని 2రాష్ట్రాలు సమగ్రంగా వినియోగించుకోవడం, విద్యుత్తు సంస్థల విభజన, తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా పలు కీలకాంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌పై కూడా చర్చించే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధాన అంశాలపై ముఖ్యమంత్రులిద్దరూ చర్చించి ఓ అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్న పలు అంశాలను సామరస్యంగా పరిష్కరించుకోవడంతోపాటు, గోదావరి వరద నీటిని రెండు రాష్ట్రాల్లోని కరవు ప్రాంతాలకు వినియోగించుకోవడంపైన చర్చించే అవకాశం ఉంది తెలుస్తుంది.
ఈ కార్యక్రమాల్లో ఎవరెవరు హాజరవుతారు?
తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ఐదుగురు మంత్రులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, నీటిపారుదల, ఆర్థిక, విద్యుత్, పౌరసరఫరాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సాధారణ పరిపాలన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. వీరితోపాటు రెండు ప్రభుత్వాల సలహాదారులు, నీటిపారుదల శాఖ, ఆర్థిక, ఇంధన శాఖల ముఖ్యకార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు, పునర్విభజన చట్టం అమలుకు సంబంధించిన అధికారులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిస్తున్నది.
చర్చించే అంశాలు?
- గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీజలాలపై వివాదాల పరిష్కారం ప్రధానాంశం.
- గోదావరి, కృష్ణా జలాల వాడకం, రెండు రాష్ట్రాల అవసరాలు, నీటి పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన ఇవ్వనున్నారు.
- రెండు రాష్ట్రాల వాటా మేరకు గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చిసిస్తారు.
- ఐదేళ్లుగా దస్త్రాల్లో మగ్గుతున్న హైదరాబాద్-అమరావతి ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రతిపాదనల అంశం కూడా సమావేశంలో చర్చకురానుంది.
- విద్యుత్ సంస్థల విభజన, 1200 మంది ఉద్యోగుల సర్దుబాటు, విభజన సమయం నాటికి డిస్కంలకు బకాయిల చెల్లింపుల అంశం.
- పౌరసరఫరాల సంస్థ విభజన, లెవీ నిధుల వినియోగం విషయం.
- దిల్లీలోని ఏపీ భవన్ వ్యవహారం.
- తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన అంశం.
తెలుగు రాష్ట్రాలకు కొత్త వెలుగులు రానున్నాయి
‘‘తెలుగు రాష్ట్రాలు స్నేహభావంతో మెలుగుతున్నాయి. దీంతో కొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి అన్నారు తెలంగాణ సీఎం. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి నడుంబిగించాం. జగన్ యువకుడు, ఏపీ అభివృద్ధిపై గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య శుక్ర, శనివారాల్లో వివిధ అంశాలపై కీలక సమావేశాలు నిర్వహించనున్నాం. నదీ జలాల వినియోగంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను చర్చిస్తాం. వాటి ద్వారా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది’’ అన్న సీఎం కెసిఆర్.