కేబినెట్‌ భేటీపై కొనసాగుతున్న ఉత్కంఠ

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో రేపటి మంత్రివర్గ సమావేశం అత్యంత కీలకంగా మారింది. పూర్తిగా ఎన్నికల కోణంలోనే కేబినెట్ భేటీ జరగనుంది. ప్రగతి నివేదన సభకు కొద్ది సేపటి ముందే కేబినెట్ భేటీ కానుండడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. శాసనసభ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతున్నప్పటికీ… అధికార పార్టీ నేతలు, ఉన్నతాధికారులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి.
ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాయత్తమవుతోన్న వేళ జరగుతోన్న భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా రైతులు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కొన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ ఉద్యోగులకు ఏకంగా 35శాతం వేతన సవరణ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల ఐఆర్ పై కూడా పూర్తి సానుకూల నిర్ణయం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఉద్యోగులకు డీఏ కూడా ప్రకటించనున్నారు. మధ్యంతర భృతికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 18 శాతం ఐఆర్ ను వారు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ ప్రకటన నేపథ్యంలో ఉద్యోగుల ఐఆర్ కూడా ఓ మోస్తారుగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
రైతులకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంటున్నారు. రెైతుబంధు రెండో విడతకు ఇప్పటికే నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం… రెండో దఫా చెక్కుల పంపిణీ తేదీని కూడా ఖరారు చేయవచ్చని సమాచారం. నవంబర్ నెల రెండో వారంలో చెక్కుల పంపిణీ ఉండవచ్చని సమాచారం. అటు నూతన జోనల్ వ్యవస్థకు ఆమోదం నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ-ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అర్చకుల పదవీ విరమణ వయస్సు పెంపు, మౌజామ్ లకు వేతనం పెంపు లాంటి ప్రకటనలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. వీటితో పాటు పలు ఇతర అంశాలకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అటు లోక్ సభతో సంబంధం లేకుండా శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లే సన్నాహాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఇందుకు సంబంధించి శాసనసభ రద్దు నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఈ అంశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని తెరాస నేతలు, ఉన్నతాధికారులు ధృవీకరించడం లేదు. ఇందుకు మరోమారు సమావేశం కావచ్చని భావిస్తున్నారు. మొత్తమ్మీద రేపు ప్రగతి నివేదన సభ ముందు జరగనున్న మంత్రివర్గ సమావేశం అంతటా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

Leave a Response