ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పర్యటన ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందురోజు బుధవారం ఆయన కడప జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేరుగా 11.54 గంటల ప్రాంతంలో పెద్ద దర్గాకు చేరుకున్నారు..అక్కడ స్థానిక దర్గా పీఠాధిపతులు, పలువురు ఎమ్మెల్యేలు జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్మోహన్‌రెడ్డి తలకు ఆలయ మతపెద్దలు కండువా కట్టగా ముస్లిం సాంప్రదాయంలో చాదర్ సమర్పించారు. అంతేగాకుండా కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజాద్‌బాషాలు కార్పొరేటర్లు, ముఖ్య వైకాపా నాయకులను పరిచయం చేయగా ఆయన అందరికీ కరచాలనం చేశారు. కడప నగరానికి చెందిన పలువురు నేతలు జగన్మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల అనంతరం 12.30 గంటల ప్రాంతంలో పులివెందులకు బయలుదేరారు. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో పాటుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, కడప, కమలాపురం ఎమ్మెల్యేలు అంజాద్‌బాషా, రవీంద్రనాథరెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబులతో పాటుగా కార్పొరేటర్లు పాకా సురేష్, షంషీర్, కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అభిషేక్ మహంతి, ఓఎస్డీ ధనుంజయరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
కడప పెద్ద దర్గాకు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు, యువత, వృద్ధులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే జగన్ పెద్ద దర్గా వచ్చే వరకు పరిసర ప్రాంతాలన్నీ పోలీసు పహారాలో నిలిచిపోయాయి. ఎవరినీ కూడా దర్గాలోనికి అనుమతించలేదు. పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉండిపోయాయి. అదే సమయంలో జగన్ కాన్వాయ్ కూడా రావడంతో జనాలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ సీఎం.. సీఎం.. అంటూ నినదించారు. జగన్ వాహనంలో పెద్దదర్గాలోనికి వెళ్లగానే జనాలు కూడా భారీ సంఖ్యలో తోసుకుంటూ లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద దర్గాలోనికి కేవలం పాస్‌లున్న వారికి మాత్రమే అనుమతిచ్చారు. ఈ సందర్భంగా పాసులుండే పోలీసుల వద్ద పేర్లు లేకపోయిన కొంతమందిని అదే పేరుతో మరొకరు వెళ్లిన నేపథ్యంలో పోలీసులకు కార్యకర్తలకు స్వల్ప వివాదం చెలరేగింది.