నవంబర్ 19న మునిసిపల్ ఎలెక్షన్..!

న్యాయపరమైన ఇబ్బందులు లేని 53 మున్సిపాలిటీలు కార్పోరేషన్లకు ఈ నెల 4 న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం. వీటికి సంబంధించిన రిజర్వేషన్ లను మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ అర్బన్ డెవలప్ మెంట్ అధికారులు ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. నవంబర్ 2న ఈసీకి రిజర్వేషన్ ల వివరాలు ఇస్తారని 4 న నోటిఫికేషన్ వస్తుందని అధికార వర్గాల సమాచారం.జవహర్ నగర్, బడంగ్ పేట్, నిజాంపేట కార్పొరేషన్లతోపాటు 50 మునిసిపాలిటీల్లో ఈ నెల 19 న పోలింగ్ నిర్వహించే వీలుంది. ఒకటి రెండు రోజులు నోటిఫికేషన్ ఆలస్యమైతే 21 వ తేదీ లోగా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరీంనగర్ ,రామగుండం, నిజామాబాద్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్లతోపాటు 77 మున్సిపాలిటీల్లో వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ మునిసిపాలిటీల్లో ఎన్నికలపై హై కోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చారు. పిటిషన్లపై నిన్న హైకోర్టులో విచారణ జరగ్గా వాటిని డివిజన్ బెంచ్ కు బదలీ చేస్తామని సింగిల్ జడ్జి చెప్పారు. ఒకవేళ కోర్టులో ప్రక్రియ లేటైతే న్యాయపరంగా ఇబ్బందుల్లేని మునిసిపాలిటీలు కార్పొరేషన్ లలో ముందుగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం మున్సిపల్ శాఖను ఆదేశించినట్టు సమాచారం. రాష్ట్రంలో 77 మునిసిపాలిటీలపై ఉన్న స్టేలను ఎత్తివేయ్యాలని హైకోర్టును కోరింది ప్రభుత్వం. డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిన కేసుల్లోని అంశాలు సింగిల్ జడ్జి ఇచ్చిన కేసుల్లోని విషయాలు ఒకే తరహాలో ఉన్నాయని చెప్పింది. దీన్ని పిటిషనర్ల తరఫు లాయర్ లు వ్యతిరేకించారు. స్టే ఇచ్చినప్పుడు ప్రభుత్వం కౌంటర్ వేయాలే కానీ కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎన్నికలకు వీలుగా స్టే ఎత్తేయాలని కోరడం చట్ట విరుద్ధమన్నారు. దీంతో తాము ఏ నిర్ణయం తీసుకోవడం లేదని జస్టిస్ చల్లా కోదండరాం చెప్పారు. రెండు పక్షాలు ఒక నిర్ణయానికి వస్తే ఉత్తర్వులు ఇవ్వగలమని లేదంటే డివిజన్ బెంచ్ తీర్పు చూసి నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు.

Leave a Response