ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలు తీసిన డెంగ్యూ…

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగిపోయాయి. వైద్యారోగ్యశాఖ అధికారుల నిద్ర మత్తు జనాల ప్రాణాలను తోడేస్తుంది. పల్లె పట్నం అని తేడా లేకుండా పారిశుధ్య లోపం ఎక్కడ చూసినా కనిపిస్తుంది. దాంతో దోమలు విజృంభించి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. డెంగ్యూ జ్వరం కారణంగా గుడిమెల్ల రాజ గట్టు కుటుంబం బలైపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీ నగర్ కాలనీలో చోటుచేసుకుంది.ఆ పసిగుడ్డు నిండా కళ్లు కూడా తెరవలేదు. పుట్టి రెండు రోజులైనా తమ్ముడు ఆసుపత్రి బెడ్ పైనే ఉన్నాడు.ఇదిలా ఉంటే ఏమీ తెలియని పసి వయసులో ఇంకోక బాలుడు తల్లికి తల కొరివి పెట్టాడు. డెంగ్యూ బారిన పడి అంతులేని విషాదం నిండిన ఆ కుటుంబాన్ని చూసి ప్రతి హృదయం తల్లడిల్లుతోంది. 20 రోజుల వ్యవధిలో రాజ గట్టుతో పాటు తాత లింగయ్య, కూతురు శ్రీవర్షిణి తాజాగా ఆయన భార్య సోనా సైతం ప్రాణాలు కోల్పోయారు. తల్లిపాల కోసం తల్లడిల్లే తమ్ముడు అమ్మా నాన్న కోసం ఎదురు చూసే అన్న ఇద్దరూ తల్లితండ్రులు లేని అనాథలయ్యారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఒక్కో బెడ్ పై ఇద్దరు ముగ్గురికి చికిత్స అందిస్తున్నారంటే విషజ్వరాల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నాలుగు జిల్లాలు, నలుగురు కలెక్టర్లు, డీఎంహెచ్ఒలు ఉన్న మునిసిపాలిటీలో పారిశుద్ధ్య లోపం పట్టి పీడిస్తోంది.ఒక్క నెలలోనే మూడు వందలకి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొమురం భీం జిల్లాలో 36, నిర్మల్ లో 34 ,మంచిర్యాల జిల్లాలో 37 వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిసింది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగురు 20 రోజుల వ్యవధిలో ప్రాణాలు విడవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. డెంగ్యూ తీవ్రత పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులు కాలనీల్లో పర్యటిస్తున్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలను సేకరిస్తున్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు.

Tags:dengue fever

Leave a Response