క్రెడిట్ కోసం జనసేన ప్రయత్నిస్తోందా?

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమైతే, ఇప్పటికే అనేక రూపాల్లో పెద్దఎత్తున నిరసనలు ఆందోళనలు చేపట్టింది. ఇప్పుడు జనసేన తన వంతుగా లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది. అంతేకాదు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌, ఎన్నికలైన తర్వాత చేపడుతున్న తొలి ఉద్యమం ఇది. ఇప్పటికే అక్కడక్కడా ఇసుక రీచ్‌లలో పర్యటించిన పవన్, అసలు సమస్యేంటి, ప్రభుత్వం చెబుతున్నట్టు ఇసుక దొరుకుతోందా లేదా అని స్వయంగా కార్మికులను, మేస్ట్రీలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో ఇసుక సమస్య లేకపోయినా, ఏపీలోనే ఎందుకుందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నా, ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులకు బాసటగా వైజాగ్‌లో లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చారు. అయితే, భవన నిర్మాణ కార్మికుల తరఫున కలసికట్టుగా పోరాడదామంటూ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు జనసేనాని. కేవలం సంఘీభావం మాత్రమే తెలుపుతామని, లాంగ్ మార్చ్ లో పాల్గొనబోమని స్పష్టతనిచ్చారు. ఇక, మొదట్నుంచీ ధాటిగా నిరసనలు చేపడుతోన్న తెలుగుదేశం కూడా నేరుగా లాంగ్ మార్చ్ లో పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఇసుకపై పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడుతూ టీడీపీ జనంలోకి వెళ్లింది. ఒకవేళ ఇప్పుడు జనసేన లాంగ్ మార్చ్ లో పాల్గొంటే, ఆ క్రెడిట్ మొత్తం జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశముంటుందని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ పిలుపునకు సానుకూలంగా స్పందించినా, ప్రత్యక్షంగా లాంగ్ మార్చ్ లో పాల్గొనే అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఇక, మొదటినుంచి జనసేనతో కలిసి నడుస్తున్న వామపక్షాలు మాత్రమే వైజాగ్ లాంగ్ మార్చ్ లో పాల్గొనే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, టీడీపీ, బీజేపీలు… లాంగ్‌ మార్చ్‌ లో పాల్గొనకపోతే, ప్రజా సమస్యలను కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని, ఈ పార్టీలనూ పవన్ ఎండగట్టే అవకాశముందంటున్నారు.

Leave a Response