రూ.2 కోట్ల డీల్‌ కాదన్న సాయిపల్లవి…..

సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసినా, కనీసం ఓ సినిమా టీజర్‌ను విడుదల చేసినా సెలబ్రిటీలు డబ్బులు తీసుకుంటుంటారు. సామాజిక సేవ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మాత్రం డబ్బులు తీసుకోకుండా పాల్గొనే వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో సాయిపల్లవి ఒకరు. ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఆమె ఇప్పటి వరకు ఒక్క వాణిజ్య ప్రకటనలోనూ నటించలేదు. ‘ప్రకటనల్లో నటించను, ఆహ్వానిస్తే సామాజిక కార్యక్రమాలకు వెళ్తా.. మేకప్‌ వేసుకోను..’ అని ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి చెప్పారు. ఇలా విభిన్నంగా ఆలోచిస్తూ ఆమె అందరికంటే ప్రత్యేకం అనిపించుకున్నారు.
అయితే ఈసారి సాయిపల్లవి ఓ పెద్ద డీల్‌ను కాదని వార్తల్లో నిలిచారు. ఓ ప్రముఖ ఉత్పత్తుల సంస్థ తమ ఫేస్‌ క్రీమ్‌కు ప్రచారకర్తగా ఉండమని ఆమెను కోరినట్లు సమాచారం. దీనికి పారితోషికంగా రూ.2 కోట్లు ఇస్తామని కూడా సంస్థ పేర్కొందట. కానీ ఆమె నో చెప్పినట్లు తెలిసింది. తనే మేకప్‌ వేసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నానని, అలాంటిది ఫేస్‌ క్రీమ్‌ వాడమని ఎలా ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారట. దీంతో మేకప్‌ లేకుండా అలానే ప్రకటనలో నటించమని కోరినా.. ఆమె తిరస్కరించినట్లు చెబుతున్నారు. సాయిపల్లవి ఇటీవల ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె సూర్యకు జోడీగా ‘ఎన్జీకే’, రానాతో కలిసి ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Leave a Response