నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు: అనుష్క

‘అరుంధతి’లో జేజమ్మగా.. ‘బాహుబలి’లో  దేవసేనగా ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు సినీ నటి అనుష్క. ఆమె చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 14  సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా కెరీర్‌ తొలి రోజులను గుర్తుచేసుకుంటూ ఇన్‌స్టాగ్రామలో ఓ వీడియోను పోస్ట్‌చేశారు. ‘నేను సినిమాల్లోకి నాకు  నేనుగా రాలేదు. అలా జరిగిపోయింది. పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’ సినిమాలో హీరోయిన్‌ కోసం చూస్తుంటే నాకు తెలిసిన ఆయన ఫ్రెండ్‌ ఒకరు నా గురించి చెప్పారు. అప్పుడు పూరీ సర్‌ చెప్పడంతో హైదరాబాద్‌కు వచ్చాను. అలా నాకు అవకాశం వచ్చింది. నేను కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్లు అవుతోంది. నా కోసం సమయం కేటాయించుకుని (దర్శక, నిర్మాతలు) నా జీవితాన్నే మార్చేసినవారందరికీ, నాగార్జున, పూరీ జగన్నాథ్‌కి, నా కుటుంబం, స్నేహితులు, అభిమానులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు స్వీటీ.
2005లో వచ్చిన ‘సూపర్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అనుష్క. ఆ తర్వాత ‘విక్రమార్కుడు’, ‘డాన్‌’, ‘చింతకాయల రవి’, ‘అరుంధతి’, ‘బిల్లా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించారు. చివరిగా ‘భాగమతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క కొంతకాలం విరామం తీసుకుని తన తర్వాతి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. హేమంత్‌ మధుకర్‌ తెరకెక్కిస్తున్న ‘సైలెన్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారు. ఇందులో మాధవన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో స్వీటీ లుక్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని చిత్ర నిర్మాత కోన వెంకట్‌ తెలిపారు.

Leave a Response