మేడిగడ్డి బ్యారేజిని ముఖ్యమంత్రి కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బ్యారేజికి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ-మహారాష్ట్రాల మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుండి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజి లోపలికి నీరు నిలువ ఉంచే చోటును పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తన్నది విడమరిచి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చారిత్రక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర పఢ్నవీస్ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ను పంప్ హౌజ్ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్ధకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్ధ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతలను వివరించారు.నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షనలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి చెందిని ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోను వివాదాలు ఉండేవి. నీటి వాటాలు, పంపకాల విషయంలో పేచీలు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏర్పడిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసిఆర్ స్నేహ పూర్వక దౌత్య సంబంధాలు నడిపారు. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టిఎంసీల చొప్పున సముద్రం పాలు కావడం కన్న సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.