సహనం పాటించండి!

తొందర పడవద్దు.. సహనం పాటించండి అని నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తన అభిమానులకు, దివ్యాంగులకు, హిజ్రాలకు విజ్ఞప్తి చేశారు. రాఘవ లారెన్స్‌కు, నామ్‌ తమిళర్‌ పార్టీ నేత సీమాన్‌కు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇటీవల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాఘవలారెన్స్‌ ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు.

అందులో.. ‘కాంచన–3 చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు కృతజ్ఞతలు. నాపై ప్రేమాభిమానాలు కలిగిన వారికి ఒక విన్నపం. నా తరుపున కొందరు దివ్యాంగులు, హిజ్రాలు, పోలీస్‌కమిషనర్‌ కార్యాలయంలో కొందరిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. అలాంటిదేమీ చేయకండి. సహనాన్ని పాఠించండి. మనం మంచినే కోరుకుందాం. మంచినే చేద్దాం.వారిని వారి ఇష్టానికే వదిలేద్దాం. నాకు చిన్న సమస్య అని తెలియగానే పరిగెత్తుకొచ్చే మీ అందరికీ నా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతం నేను ముంబైలో కాంచన చిత్ర హిందీ రీమేక్‌ షూటింగ్‌లో ఉన్నాను. షూటింగ్‌ పూర్తి కాగానే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. భగవంతుడు మనకి మంచే చేస్తాడు. మనకు చెడు జరగాలని భావించేవారికీ మంచే జరగాలని మనం దేవుని ప్రార్థిద్దాం. మన గురించి అర్థం చేసుకునేలా వారికి ఆ భగవంతుడి కృప కలగడం’ అని పేర్కొన్నారు. 

Leave a Response