విలక్షణ నటుడు రాళ్లపల్లి ఇక లేరు..

విలక్షణ నటుడు రాళ్లపల్లి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకి ఈ నెల 15న ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ నటుడిగా, ప్రతినాయకుడిగా 850కిగాపైగా సినిమాల్లో నటించి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలపై తనదైన ముద్ర వేశారు. నటనని వృత్తిగానో, ప్రవృత్తిగానో కాకుండా… నటనే ప్రాణంగా భావించిన అరుదైన నటుడు రాళ్లపల్లి. సినిమా రంగంపైనే కాకుండా నాటక, టెలివిజన్‌ రంగాలపైనా చెరిగిపోని ముద్ర వేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ఓ ప్రత్యేక స్థానమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.ఆయన రాళ్లపల్లి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. రాళ్లపల్లి మరణించడంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూతురు అమెరికా నుంచి వచ్చాక రాళ్లపల్లి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Leave a Response