ఖతార్ ఎయిర్వేస్కు చెందిన కోల్‌కతా- దోహ విమానాన్ని గురువారం తెల్లవారుజామున టేకాఫ్ అవుతున్న సమయంలో వాటర్ ట్యాంకర్ ఢీకొంది. కో్ల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణీకులున్నారు. ఘటన జరిగిన వెంటనే వారందరినీ సురక్షితంగా విమానం నుంచి దించివేశారు. విమానం పాక్షికంగా దెబ్బతిన్నదని అధికారులు తెలిపారు. కాగా ఉదయం 2.30 గంటలకు ప్రయాణీకులు విమానంలోకి ఎక్కుతున్న క్రమంలో వాటర్ ట్యాంకర్ విమానం ల్యాండింగ్ గేర్‌కు సమీపంలో మధ్య భాగాన్ని ఢీకొట్టిందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వర్గాలు వెల్లడించాయి.
ఘటన జరిగిన వెంటనే ప్రయాణీకులను దించివేసి తనిఖీలు చేపట్టారని, ప్రయాణీకులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. సమీప హోటల్లో ప్రయాణీకులందరికీ వసతి సౌకర్యం కల్పించామని, శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు విమానంలో వారిని దోహా తరలిస్తామని వెల్లడించారు. వాటర్ ట్యాంకర్ బ్రేక్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే విమానాన్ని ఢీ కొట్టిందని ఏఏఐ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని ఏఏఐ అధికారులు పేర్కొన్నారు.