. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. ఈసినిమా మహేష్ 25 సినిమా కూడా కావటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రయూనిట్ కూడా అదే స్థాయిలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది. బుధవారం అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో తనకు సక్సెస్ ఇచ్చిన ఒక్కో దర్శకుడికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు మహేష్.
తొలి చిత్ర దర్శకుడు రాఘవేంద్ర రావు నుంచి కొరటాల శివ వరకు అందరిని గుర్తుపెట్టుకొని థ్యాంక్స్ చెప్పిన సూపర్ స్టార్. తన కెరీర్లో కీలకమైన రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ పేరు మాత్రం చెప్పలేదు. పోకిరి సినిమాతో మహేష్‌ను సూపర్ స్టార్‌ను చేసిన పూరి, తరువాత బిజినెస్‌మేన్‌తో మరో హిట్ ఇచ్చాడు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన పోకిరి లాంటి సినిమా మహేష్‌కు నిజంగానే గుర్తుకు రాలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూరి… మహేష్ హీరోగా జనగణమన అనే సినిమాను చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశాడు. అయితే ఏళ్లు గడుస్తున్న ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఈ సినిమా విషయంలోనే మహేష్, పూరిల మధ్య దూరం పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వేదిక మీద పూరి జగన్నాథ్ పేరు చెప్పని మహేష్ తరువాత ట్విట్టర్ ద్వారా పూరికి థ్యాంక్స్ చెప్పాడు.
కేవలం పూరినే కాదు మహేష్ బాబుకు సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చిన వన్ నేనొక్కడినే సినిమా దర్శకుడు సుకుమార్ పేరును కూడా ప్రస్థావించలేదు మహేష్. మహర్షి తరువాత మహేష్, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కథా కథనాలపై ఏకాభిప్రాయం రాకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు మహేష్. ఇలా తనతో సన్నిహితంగా లేని దర్శకుల పేర్లను మహేష్ పక్కన పెట్టేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.