ప్రత్యేక హోదా ఎంత వరకు నెరవేరుతుంది… 

 వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధించటమే తమ లక్ష్యమని  పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో పెనవేసుకుపోయిన అంశం. ఇప్పటి ఎన్నికల్లో ఇదే అంశాన్ని అన్ని పార్టీలు ఎన్నికల అజెండాలోనూ చేర్చాయి. తాజాగా అఖండ విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి దీనిపై మొదట్నుంచి పోరాడుతున్నారు. 2014 ఎన్నికల్లో వైకాపా ఓడిపోయాక కళాశాలల విద్యార్థులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశాల్లో, ఇతరత్రా వేదికలపై దీనిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి మాట్లాడారు. పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా వస్తే ప్రతి పట్టణం హైదరాబాద్‌గా మారుతుందని, యువతకు ఉద్యోగాలొస్తాయని పేర్కొన్నారు. విజయం సాధించిన అనంతరం గురువారం జాతీయ మీడియాతో జగన్‌ మాట్లాడుతూ ‘‘ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేస్తామని’’ మరోసారి స్పష్టం చేశారు. వైకాపా అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాల్ని గెలుచుకున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌ని బలంగా వినిపించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటానికి మాత్రం అవకాశముంది. ఆ ఆకాంక్ష ఎంత వరకు నెరవేరుతుంది? అనేది ప్రస్తుతానికి సందిగ్ధమే.

Leave a Response