పవన్ తో సినిమా పై హరీష్ క్లారిటీ

ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రస్తుతం ‘వాల్మీకి’ సినిమాతో బిజీగా ఉన్నారు. అయితే ఆయన అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌తో ఓ సినిమా తీయబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చారు. మరోపక్క ‘వాల్మీకి’ కథానాయిక పూజా హెగ్డేకు భారీ పారితోషికం ఇస్తున్నారని పలు వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. ఈ వార్తలపై హరీష్‌ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
‘వార్తలు వైరల్‌గా మారాయి కాబట్టి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నా. ఇందులో మొదటిది.. పూజా హెగ్డే పారితోషికంపై జరుగుతున్న ప్రచారం నిజం కాదు. రెండోది.. మీకంతా తెలుసు. నాకు పవర్‌స్టార్‌ను డైరెక్ట్‌ చేయడం అంటే చాలా ఇష్టమని. మేం ఇటీవల సమావేశమయ్యాం అని వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఏదైనా సరే.. నా నుంచి, లేదా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలని సినీ ప్రేమికుల్ని కోరుతున్నా. ధన్యవాదాలు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.
2017 ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ తర్వాత హరీష్‌ తెరకెక్కిస్తున్న సినిమా ‘వాల్మీకి’. ఇందులో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది. పూజా హెగ్డే కథానాయిక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో తమిళ కథానాయకుడు అథర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

Leave a Response