అందుకే మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా!

తెలుగు చిత్ర పరిశ్రమలో పవన్‌కల్యాణ్‌కు ఉన్న స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో ఫైట్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతారు. తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’లోనే ఒంటిపై బండలు పగలగొట్టించుకున్నారు. చేతులపై కార్లు ఎక్కించుకున్నారు. ఇక తర్వాత చాలా చిత్రాల్లో ఆయన మార్షల్‌ ఆర్ట్స్‌ కళను ప్రదర్శించారు. జానీలో ఏకంగా మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా, భార్యను కాపాడుకోవడం కోసం ఫైట్స్‌ చేస్తూ కనిపించారు. మరి అసలు పవన్‌కల్యాణ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? అని అడిగితే… చిన్నప్పుడు మార్షల్స్‌ ఆర్ట్స్‌ను వెటకారంగా చూసేవాడిని. నాగబాబు అన్నయ్య చాలా సీరియస్‌గా నేర్చుకునేవాడు. నెల్లూరులో తను కరాటే నేర్చుకున్నాడు. నన్ను నేర్చుకోమంటే ఎగతాళిగా మాట్లాడేవాడిని. బ్రూస్లీ సినిమాలు చూసినా, నాకు ఏమీ అనిపించేది కాదు. అలాంటి విద్యలు వాళ్లకు వస్తాయి కానీ, మనకెందుకు వస్తాయి అనుకునేవాడిని. కాలేజ్‌ వెళ్లే సమయానికి ఒక రకమైన గొడవలు అయ్యేవి.  చిరంజీవిగారి బ్రదర్‌ను కావడం వల్ల ఆయన సినిమాలను వెక్కిరిస్తూ, విమర్శిస్తూ నాతో గొడవ పెట్టుకునేందుకు ఎవరో ఒకరు రెడీగా ఉండేవాళ్లు. అప్పుడప్పుడు మద్రాసు వెళ్తే, అక్కడ కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి అనేవాళ్లు. కోపం వచ్చి వాళ్లను కొట్టాలనిపించినాశారీరకంగా బలం లేకపోవడం వల్ల గొడవలకు వెళ్లాలంటే వెనకడుగు వేసేవాడిని. ఒక వేళ నేను గొడవకు వెళ్లి నన్ను నేను రక్షించుకోలేక పోతే.. ఎలా? అనుకునేవాడిని. నాకు వచ్చే కోపాన్ని  కంట్రోల్‌ చేసుకుని సామర్థ్యం ఉండేది కాదు. అప్పుడు నాకు కనిపించిన మార్గం మార్షల్‌ ఆర్ట్స్‌. మన మీద మనకు కంట్రోల్‌ లేకపోతే చిన్న తప్పునకు కూడా ఎక్కువ రియాక్ట్‌ అవుతాం. కానీ, మార్షల్‌ ఆర్ట్స్‌ మనల్ని మనం కంట్రోల్‌ చేసుకునే శక్తి ఇస్తుంది. మార్షల్‌ఆర్ట్స్‌ నేర్చుకున్నంత మాత్రాన వెళ్లి కొట్టేస్తామని కాదు కానీ, గొడవ జరిగే పరిస్థితులను చూసే విధానం మారిపోతుంది. అందుకే వాటిలో శిక్షణ తీసుకున్నా. అయితే, పూర్తి స్థాయి మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం ఉన్న సినిమాలో నటించి రక్తి కట్టించే స్థాయి నాకు లేదు.’’ అని చెప్పుకొచ్చారు.

Leave a Response